జీవితం గురించి మరియు దేవుని గురించి అన్వేషించదగిన ప్రశ్నలు అడిగే చోటు
జీవితం గురించి మరియు దేవుని గురించి అన్వేషించదగిన ప్రశ్నలు అడిగే చోటు
పంచుకోండిి  

విషాదం మధ్యలో దేవుడు ఎక్కడ ఉన్నాడు?

“దేవా నీవెక్కడున్నావు?” అని ఎప్పుడైనా అడిగారా. దేవుని దగ్గర నుండి మీరు ఏమి ఆశిస్తున్నారు?

సహాయం కొరకు దేవునిపై మనం ఎంత వరకు ఆధారపడగలం? ఆయన పైన అసలు మనం ఆధారపడగలమా...విషాద సమయంలో మరియు నెమ్మది ఉన్న సమయంలో?

దేవుడు ఎవరు?

దేవుడు సర్వలోకమునకు సృష్టికర్త మరియు మనం ఆయనను తెలుసుకోవాలని ఆయన ఆశపడుతున్నాడు. అందుకే మనమంతా ఇక్కడ ఉన్నాము. మనం ఆయనపై ఆధారపడి ఆయన బలం, ప్రేమ, న్యాయం, పరిశుద్ధత, మరియు దయను అనుభవించాలని ఆయన కోరుతున్నాడు. కాబట్టి ఇష్టపడినవారందరిని, “నా యొద్దకు రండి” అని ఆయన పిలుస్తున్నాడు.

మన వలె కాక, రేపు, రానున్న వారం, రానున్న సంవత్సరం, రానున్న దశాబ్దంలో ఏమి జరగబోతుందో దేవునికి తెలుసు. ఆయన అంటున్నాడు, “నేను దేవుడను, మరియు నా వలె ఎవ్వరు లేరు, మరియు ఆరంభము నుండి అంతమును ఘోషిస్తాను.”1 లోకములో ఏమి జరగబోతుందో ఆయనకు తెలుసు. అన్నిటికంటే ముఖ్యంగా, మీ జీవితములో ఏమి జరగబోతుందో ఆయనకు తెలుసు మరియు మీరు ఆయనను మీ జీవితములోనికి ఆహ్వానిస్తే ఆయన ప్రతి పరిస్థితిలోను మీతో ఉంటాడు. “దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై యున్నాడు ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు”2 అని ఆయన చెబుతున్నాడు. కాని ఆయనను మనం హృదయపూర్వకంగా వెదకాలి. ఆయన అంటాడు, “మీరు నన్ను వెదకిన యెడల, పూర్ణమనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయునెడల మీరు నన్ను కనుగొందురు.”3

కష్ట సమయాలలో దేవుడు ఎక్కడ ఉన్నాడు?

-దేవుని ఎరిగిన వారు కష్ట సమయాలను తప్పించుకొనవచ్చని దీని అర్థం కాదు. వారు తప్పించుకోరు. ఒక తీవ్రవాద దాడిలో బాధ మరియు మరణం కలిగినప్పుడు, దేవుని ఎరిగినవారు కూడా దానిలో ఉంటారు. కాని దేవుని సన్నిధి శాంతిని బలమును ఇస్తుంది. యేసు క్రీస్తు అనుచరుడు ఒకడు ఇలా అన్నాడు: “ఎటుబోయినను శ్రమపడుచున్నను ఇరికింపబడువారము కాము; అపాయములో నున్నను కేవలము ఉపాయము లేనివారము కాము; తరుమబడు చున్నను దిక్కులేనివారము కాము; పడద్రోయబడినను నశించువారము కాము.”4 జీవితంలో మనం సమస్యలను అనుభవిస్తామని వాస్తవికత చెబుతుంది. అయితే, దేవుని ఎరిగినప్పుడు వాటిని మనం ఎదుర్కొంటే, వాటికి మనం వేరే దృష్టి కోణంతో మరియు మనది కాని శక్తితో ప్రతిస్పందించవచ్చు. దేవుని ఎదుట నిలువబడగలిగిన శక్తి ఏ సమస్యకు లేదు. మనం ఎదుర్కొను సమస్యలన్నిటి కంటే ఆయన గొప్పవాడు, మరియు వాటిని ఎదుర్కొనుటకు మనం ఒంటరిగా విడిచిపెట్టబడలేదు.

"యెహోవా ఉత్తముడు, శ్రమ దినమందు ఆయన ఆశ్రయదుర్గము, తన యందు నమ్మికయుంచువారిని ఆయన ఎరుగును "5 అని దేవుని వాక్యం మనకు చెబుతుంది. మరియు, " తనకు మొఱ్ఱపెట్టువారి కందరికి తనకు నిజముగా మొఱ్ఱపెట్టువారి కందరికి యెహోవా సమీపముగా ఉన్నాడు. తనయందు భయభక్తులుగలవారి కోరిక ఆయన నెర వేర్చును వారి మొఱ్ఱ ఆలకించి వారిని రక్షించును."6

యేసు క్రీస్తు తన అనుచరులకు ఈ ఆదరణ మాటలు చెప్పాడు: "రెండు పిచ్చుకలు కాసుకు అమ్మబడును గదా; అయినను మీ తండ్రి సెలవులేక వాటిలో ఒకటైనను నేలను పడదు. మీ తలవెండ్రుకలన్నియు లెక్కింపబడియున్నవి గనుక మీరు భయపడకుడి; మీరనేకమైన పిచ్చుకలకంటె శ్రేష్ఠులు."7 మీరు నిజముగా దేవుని వైపుకు తిరిగితే, వేరెవ్వరు చేయలేని విధంగా ఆయన మీ శ్రద్ధను తీసుకుంటాడు.

దేవుడు మరియు మన స్వయేచ్చ

దేవుడు మానవ జాతిని నిర్ణయం తీసుకొనే శక్తితో సృష్టించాడు. అంటే ఆయనతో అనుబంధంలోనికి మనం బలవంతం చేయబడము. ఆయనను తిరస్కరించి ఇతర దుష్ట క్రియలు చేయుటకు కూడా ఆయన అనుమతి ఇస్తాడు. మనం ప్రేమగలిగి ఉండునట్లు ఆయన మనలను బలవంతం చేయవచ్చు. మనం మంచిగా ఉండునట్లు ఆయన మనలను బలవంతం చేయవచ్చు. కాని ఆయనతో మనం ఎలాంటి అనుబంధం కలిగియుంటాము? అది అసలు అనుబంధము కానేకాదు, కానీ అది ఒక బలవంతమైన శాసించు విధేయత అవుతుంది. బదులుగా ఆయన మనకు గౌరవప్రదమైన మానవ స్వయేచ్చను ఇస్తున్నాడు.

స్వాభావికంగా, మన ప్రాణము యొక్క లోతుల నుండి అడుగుతాము ... “కాని ప్రభువా, ఇలాంటిది నాకు జరుగుటకు నీవు ఎందుకు అనుమతి ఇచ్చావు?”

దేవుడు ఎలా కార్యము చెయ్యాలని మనం కోరతాము? ఆయన ప్రజల యొక్క క్రియలను శాసించాలని మనం కోరతామా? ఒక తీవ్రవాద దాడి విషయంలో, దేవుడు ఎంత మంది మరణించుటకు అనుమతించుట తగినది? కేవలం వందమంది మరణిస్తే మనకు కొంత ఉపశమనం కలుగుతుందా? ఒక వ్యక్తి మరణించుటకు మాత్రమే దేవుడు అనుమతిస్తే మనం సంతోషిస్తామా? అయినను, దేవుడు ఒక వ్యక్తి యొక్క హత్యను ఆపినా, నిర్ణయము తీసుకొనే స్వతంత్రత ఇక ఉండదు. దేవుని తిరస్కరించుటకు, దేవుని దూషించుటకు, వారి సొంత మార్గములలో ప్రయాణించి ఇతరులకు విరోధంగా హేయమైన క్రియలు చేయుటకు ప్రజలు నిర్ణయించుకున్నారు.

-ఈ భూగోళము సురక్షితమైన స్థలము కాదు. ఎవరో ఒకరు మనలను షూట్ చేయవచ్చు. లేక ఒక కారు మనలను ఢీకొన వచ్చు. లేక తీవ్రవాదులు దాడి చేసిన భవనం మీద నుండి మనం దూకవచ్చు. లేక దేవుని చిత్తము ఎల్లప్పుడూ అనుసరించబడని భూమి అను ఈ వాతావరణంలో ఏదో ఒకటి మనకు జరగవచ్చు. అయినను, దేవుడు ప్రజల దయలో లేడుగాని, మనుష్యులు దేవుని దయలో ఉన్నారు. మనం ఆయన దయలో జీవిస్తున్నాము. “ఆకాశవిశాల మందు జ్యోతులు కలుగును గాక”8 అని చెప్పి ఆకాశములోని లెక్కలేనన్ని నక్షత్రములను సృష్టించినది ఈ దేవుడే. “అన్యజనులకు రాజైయున్నాను”9 అని చెప్పువాడు ఈ దేవుడే. ఆయన శక్తి మరియు జ్ఞానములో పరిమితులు లేనివాడు. మనం ఎదుర్కొను సమస్యలు అధిగమించలేనివిగా ఉన్నప్పటికీ, మన యొద్ద గొప్ప శక్తి గల దేవుడు ఉన్నాడు, మరియు ఆయన అంటాడు “నేను యెహోవాను, సర్వశరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనదేదైన నుండునా?”10 ఆయన ఏదో ఒక విధంగా పాపపు మానవుల యొక్క స్వతంత్రమును నిలబెడుతూనే, ఆయన చిత్తమును జరిగిస్తాడు. “నేను చెప్పియున్నాను దాని నెరవేర్చెదను ఉద్దేశించియున్నాను సఫలపరచెదను”11 అని దేవుడు స్పష్టముగా చెబుతున్నాడు. మరియు మన జీవితాలు ఆయనకు సమర్పించబడితే దానిలో నుండి మనం ఆదరణ పొందవచ్చు. “దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్ర హించును.”12

మనం ఆయనను తిరస్కరించినప్పుడు దేవుడు ఎక్కడ ఉన్నాడు?

చాలా మంది--కాదు, మనమంతా--కొన్ని సార్లు దేవుని మరియు ఆయన మార్గాలను ఎదురించుటకు ప్రయత్నిస్తూ ఉంటాము. ఇతరులతో పోలిస్తే, ముఖ్యంగా తీవ్రవాదులతో పోలిస్తే, మనలను మనం గౌరవప్రదమైన, ప్రేమించు ప్రజలుగా భావించవచ్చు. కాని మన హృదయముల యొక్క నిజాయితీలో, మనం దేవుని ఎదుర్కొనవలసి వస్తే, అది మన పాపముల యొక్క జ్ఞానముతో జరుగుతుంది. ప్రార్థనలో దేవునితో మాట్లాడుచుండగా, దేవుడు మన ఆలోచనలను, క్రియలను, మరియు స్వార్థమును బాగుగా యెరిగియున్నాడు అని తెలుసుకొని మనం పట్టబడినట్లు భావించమా? మనం...మన జీవితాలు మరియు క్రియల ద్వారా...దేవుని నుండి దూరమైయ్యాము. చాలా సార్లు ఆయన లేకుండా మన జీవితాలను నడుపుకొనగలము అనే విధంగా జీవించాము. బైబిల్ చెబుతుంది, “మనమందరము గొఱ్ఱలవలె త్రోవ తప్పిపోతివిు మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను యెహోవా మన యందరి దోషమును అతనిమీద మోపెను.”13

పరిణామాలు? మన పాపము మనలను దేవుని నుండి దూరం చేసింది, మరియు అది ఈ జీవితం కంటే ఎక్కువ ప్రభావం చూపుతుంది. మన పాపమునకు జీతం మరణం, లేక దేవుని నుండి నిత్య ఎడబాటు. అయితే, మనం క్షమాపణ పొందుటకు మరియు ఆయనను తెలుసుకొనుటకు దేవుడు ఒక మార్గమును మన కొరకు ఇచ్చాడు.

దేవుడు మనకు తన ప్రేమను ఇస్తున్నాడు

మనలను రక్షించుటకు దేవుడు లోకమునకు వచ్చాడు. "దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకేగాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడాయనను లోకములోనికి పంపలేదు."14

ఈ లోకములో మనం ఎదుర్కొను బాధ మరియు వేదన దేవునికి తెలుసు. యేసు తన గృహములో ఉన్న భద్రతను విడచి, మనం నివసించు కష్టమైన వాతావరణములోనికి ప్రవేశించాడు. యేసు అలసిపోయాడు, ఆకలి దాహమును అనుభవించాడు, ఇతరుల నిందలను అనుభవించాడు మరియు కుటుంబము ద్వారా వెలివేయబడ్డాడు. అయితే యేసు అనుదిన కష్టముల కంటే ఎక్కువ అనుభవించాడు. మానవ రూపంలో వచ్చిన దైవ కుమారుడైన యేసు తనపై మనందరి పాపములను తీసుకొని మన మరణ శిక్షకు వెల చెల్లించాడు. "ఆయన మన నిమిత్తము తన ప్రాణముపెట్టెను గనుక దీనివలన ప్రేమ యెట్టిదని తెలిసికొనుచున్నాము."15 మనం క్షమించబడుట కొరకు సిలువలో అవమానకరమైన, బాధాకరమైన మరణమును అనుభవించాడు.

ఆయన సిలువవేయబడతాడని యేసు ఇతరులకు ముందుగానే చెప్పాడు. ఆయన దేవుడని నిరూపించుటకు మరణించిన తరువాత మూడు దినములకు ఆయన తిరిగి లేస్తానని ఆయన చెప్పాడు. ఒక రోజు మరలా తిరిగి జన్మిస్తానని ఆయన అనలేదు. (ఆయన అలా చేస్తే ఎవరికీ తెలిసేది?) సమాధి చేయబడిన మూడు దినముల తరువాత లేచి ఆయన సిలువ వేయబడుటను చూసిన వారి ఎదుట శారీరకముగా కనిపిస్తానని ఆయన వాగ్దానం చేశాడు. ఆ మూడవ రోజున, యేసు సమాధి ఖాళీగా కనిపించింది మరియు ఆయనను సజీవంగా చూశామని అనేకమంది సాక్ష్యమిచ్చారు.

ఆయనతో కూడా పరలోకములో ఉండుటకు దేవుడు మనలను ఆహ్వానిస్తున్నాడు

ఇప్పుడు ఆయన మనకు నిత్య జీవమును వాగ్దానం చేస్తున్నాడు. దానిని మనం సంపాదించలేమి. ఆయనను మన జీవితాలలోనికి ఆహ్వానించినప్పుడు అది మనకు ఆయన ఇచ్చు బహుమానం. “అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తుయేసునందు నిత్య జీవము.”16 మన పాపములను ఒప్పుకొని దేవుని వైపుకు తిరిగితే, యేసు క్రీస్తు ద్వారా నిత్య జీవమను బహుమానమును మనం పొందవచ్చు. ఇది చాలా సులభం. “దేవుడు మనకు నిత్య జీవమును దయచేసెను; ఈ జీవము ఆయన కుమారుని యందున్నది. దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము గలవాడు; దేవుని కుమారుని అంగీకరింపని వాడు జీవములేని వాడే.”17 ఆయన మన జీవితాలలోనికి ప్రవేశించాలని ఆశించుచున్నాడు.

-పరలోకం విషయం ఏమిటి? దేవుడు “మానవుల హృదయాలలో నిత్యత్వమును ఉంచాడని”18 బైబిల్ చెబుతుంది. అంటే ఉత్తమ లోకం ఎలా ఉంటుందో మన హృదయాలలో మనకు తెలుసు. మనం ప్రేమించు ప్రజలు మరణించుట ద్వారా ఈ లోకంలో మరియు ఈ జీవితంలో ఏదో తప్పు ఉందని మనకు అర్థమవుతుంది. హృదయ వేదన మరియు బాధలు లేని ఒక ఉత్తమమైన స్థలము ఉన్నదని మన ప్రాణములో ఒక మూల మనకు తెలుసు. నిశ్చయముగా, దేవుడు మన కొరకు ఉత్తమమైన స్థానమును కలిగియున్నాడు. ఆ స్థలములో ఎల్లప్పుడూ ఆయన చిత్తము జరుగుతుంది మరియు అది పూర్తిగా భిన్నమైన స్థలము. ఈ లోకంలో, ప్రజల కన్నుల నుండి దేవుడు ప్రతి బాష్ప బిందువును తుడిచి వేస్తాడు. వేదన, రోదన, మరణం లేక బాధ ఇక ఉండదు.19 మరియు ప్రజలు ఎన్నడు పాపము చేయని విధంగా దేవుడు, తన ఆత్మ ద్వారా ప్రజలలో నివాసముంటాడు.20

తీవ్రవాద దాడులు ఘోరమైనవి. యేసు అందించు దేవునితో నిత్య అనుబంధమును తిరస్కరించుట దాని కంటే ఘోరమైనది. కేవలం నిత్య జీవమును గూర్చి మాత్రమే కాదు, ఈ జీవితంలో దేవుని తెలుసుకొనుటతో పోలియున్నది ఏది లేదు. ఆయన మన జీవిత ఉద్దేశము, మన ఆదరణకు మూలం, సందిగ్ధ పరిస్థితులలో మన జ్ఞానం, మన బలం మరియు నిరీక్షణ. “యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలిసికొనుడి ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు.”21

దేవుడు కేవలం ఊతకర్ర మాత్రమే అని కొందరు అంటారు. కాని ఆయనే మాత్రమే నమ్మదగినవాడు అనుట నిజం.

యేసు అన్నాడు, "శాంతి మీ కనుగ్రహించి వెళ్లుచున్నాను; నా శాంతినే మీ కనుగ్రహించుచున్నాను; లోకమిచ్చునట్టుగా నేను మీ కనుగ్రహించుటలేదు; మీ హృదయ మును కలవరపడనియ్యకుడి, వెరవనియ్యకుడి."22 వారి జీవితాలలో యేసుపై ఆధారపడిన వారు, బండ మీద జీవితమును కట్టుకొనుటతో సమానం అని ఆయన అంటున్నాడు. ఈ జీవితంలో ఎలాంటి పరిస్థితులు మీపై దాడి చేసినా, ఆయన మిమ్మును బలముగా నిలుపగలడు.

దేవుడు ఎక్కడున్నాడు? మీ జీవితములోనికి ఆయన రాగలడు

ఈ క్షణమే మీరు యేసును మీ జీవితములోనికి ఆహ్వానించవచ్చు. "తన్ను ఎందరంగీకరించిరో వారికంద రికి, అనగా తన నామమునందు విశ్వాసముంచినవారికి, దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను."23 యేసు క్రీస్తు ద్వారా మనం దేవుని యొద్దకు తిరిగిరావచ్చు. యేసు అన్నాడు, "నేనే మార్గమును, సత్యమును, జీవమును; నా ద్వారానే తప్ప యెవడును తండ్రియొద్దకు రాడు."24 "ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపుతీసిన యెడల, నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును, నాతోకూడ అతడును భోజనము చేయుదుము,"25 అని యేసు చెప్పాడు.

-దేవుని మీరు ఈ క్షణమే మీ జీవితంలోనికి ఆహ్వానించవచ్చు. మీరు ఈ ప్రార్థన చేయవచ్చు. ప్రార్థన అనగా నిజాయితీగా దేవునితో మాట్లాడుట. ఈ క్షణములో నిజాయితీగా ఈ మాటలు చెబుతూ దేవుని మీ జీవితములోనికి ఆహ్వానించవచ్చు:

"దేవా, నా హృదయములో నీ నుండి దూరమయ్యాని, కాని నేను మారాలని ఆశపడుతున్నాను. నేను యేసు క్రీస్తును మరియు ఆయన ఇచ్చు క్షమాపణను నా జీవితములో పొందాలని ఆశించుచున్నాను. నేను నీ యొద్ద నుండి దూరమవ్వాలని ఆశించుటలేదు. ఈ దినము మొదలుకొని నా జీవితమునకు దేవునిగా ఉండుము. వందనాలు దేవా. "

ఇప్పుడే మీరు దేవుని నిజాయితీగా మీ జీవితములోనికి ఆహ్వానించారా? చేసినయెడల, మీరు చాలా విషయాల కొరకు ఎదురు చూడాలి. ఆయనను తెలుసుకొనుట ద్వారా దేవుడు మీ జీవితాలను సంతృప్తికరముగా చేస్తానని వాగ్దానము చేశాడు.26 దేవుడు ఎక్కడ ఉన్నాడు? మీలో తన గృహమును నిర్మిస్తానని ఆయన వాగ్దానము చేస్తున్నాడు.27 మరియు ఆయన నీకు నిత్య జీవమును ఇస్తాడు.28

మీ చుట్టూ ఉన్న లోకములో ఏమి జరిగినప్పటికీ, దేవుడు మీ కొరకు అక్కడ ఉండగలడు. ప్రజలు దేవుని మార్గములను అనుసరించనప్పటికీ, దేవుడు ఘోరమైన పరిస్థితులను తీసుకొని ఆయన వాటిని తన ప్రణాళికలుగా మార్చగలడు. తుదకు దేవుడు లోక సన్నివేశాలపై నియంత్రణ కలిగియున్నాడు. మీరు దేవునికి చెందినవారైతే, మీరు ఆయన చేసిన ఈ వాగ్దానముపై ఆధారపడవచ్చు, “దేవుని ప్రేమించువారికి, అనగా ఆయన సంకల్పముచొప్పున పిలువబడినవారికి, మేలుకలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని యెరుగుదుము.”29

యేసు క్రీస్తు చెప్పాడు, "శాంతి మీ కనుగ్రహించి వెళ్లుచున్నాను; నా శాంతినే మీ కనుగ్రహించుచున్నాను; లోకమిచ్చునట్టుగా నేను మీ కనుగ్రహించుటలేదు; మీ హృదయ మును కలవరపడనియ్యకుడి, వెరవనియ్యకుడి. లోకములో మీకు శ్రమ కలుగును; అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి యున్నాననెను."30 మనలను ఎన్నడు విడువను ఎడబాయనని ఆయన వాగ్దానం చేస్తున్నాడు.31

 యేసును నా జీవితములోనికి రమ్మని ఇపుడే అడిగాను (కొన్ని సహకరించే విషయాలు .......)
 ఒక వెళ్ళ నేను యేసు ను నాజీవితంలోనికి ఆహ్వానించవచ్చు ,దయచేసి వివరంగా తెలియచేయండి
 నాకు ఒక ప్రశ్నఉన్నది,,,

(1) యెషయా 46:9 (2) కీర్తనలు 46:1 (3) యిర్మీయా 29:13 (4) 2 కొరింథీ. 4:8-9 (5) నహూము 1:7 (6) కీర్తనలు 145:18-19 (7) మత్తయి 10:29-31 (8) ఆది. 1:14 (9) కీర్తనలు 47:8 (10) యిర్మీయా 32:27 (11) యెషయా 46:11 (12) యాకోబు 4:6 (13) యెషయా 53:6 (14) యోహాను 3:16-17 (15) 1 యోహాను 3:16 (16) రోమా. 6:23 (17) 1 యోహాను 5:12 (18) ప్రసంగి 3:11 (19) ప్రకటన 21:4 (20) ప్రకటన 21:27; 1 కొరింథీ. 15:28 (21) కీర్తనలు 34:8 (22) యోహాను 14:27 (23) యోహాను 1:12 (24) యోహాను 14:6 (25) ప్రకటన 3:20 (26) యోహాను 10:10 (27) యోహాను 14:23 (28) 1 యోహాను 5:11-13 (29) రోమా. 8:28 (30) యోహాను 14:27 మరియు 16:33 (31) హెబ్రీ 13:5

ఇతరులతో పంచుకోండ  

TOP